ఈటల నిజమైన ఉద్యమకారుడు..బండి సంజయ్

తొలిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఈటలకు ఆత్మీయ స్వాగతం

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు తొలిసారిగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఈటలకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఇతర ముఖ్యనేతలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈటల రాకతో బీజేపీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో ప్రధానపాత్ర పోషించిన వ్యక్తి ఈటల రాజేందర్ అని కొనియాడారు. ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు ఎదుర్కొని ప్రత్యేక రాష్ట్రం కోసం కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఉద్యమించిన వ్యక్తి ఈటల అని కీర్తించారు. ఇవాళ అమరవీరుల ఆశయాలకు వ్యతిరేకంగా తెలంగాణలో రాక్షస పాలన, కుటుంబ పాలన, గడీల పాలన కొనసాగుతోందని బండి సంజయ్ విమర్శించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈటలను ఇబ్బందులకు గురిచేయడాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అవినీతి, అరాచకాలను, కుటుంబ పాలనను ఎదిరించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని, అందుకే ఈటల వంటి ఉద్యమకారులందరూ బీజేపీలోకి వస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/