పెగాస‌స్..ఎలాంటి అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌నుకోవ‌డం లేదు

సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం

న్యూఢిల్లీ : పెగాస‌స్ వివాదంలో దాఖ‌లైన పిటిష‌న్ల‌పై తాము ఎలాంటి స‌వివ‌ర అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని అనుకోవ‌డం లేద‌ని సోమ‌వారం సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్ర‌భుత్వం. మేము దాచి పెట్టింది ఏమీ లేదు. అందుకే ప్ర‌భుత్వ‌మే త‌న‌కు తానుగా ఈ ఆరోప‌ణ‌ల‌పై విచారణ జ‌ర‌ప‌డానికి నిపుణుల క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది అని సీజేఐ జ‌స్టిస్‌ ఎన్వీ ర‌మ‌ణ‌తో కూడిన ధ‌ర్మాస‌నానికి కేంద్రం స్ప‌ష్టం చేసింది.

ఏదైనా సాఫ్ట్‌వేర్‌ను ప్ర‌భుత్వం వాడిందా లేదా అన్న‌ది ప‌బ్లిక్‌గా చ‌ర్చించే అంశం కాదు. ఈ అంశాన్ని అఫిడ‌విట్‌లో భాగం చేయ‌డం జాతి ప్ర‌యోజ‌నాల‌కు మంచిది కాదు అని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా ధ‌ర్మాస‌నానికి చెప్పారు. నిపుణుల క‌మిటీ నివేదిక‌ను తాము కోర్టు ముందు ఉంచుతామ‌ని మాత్రం హామీ ఇచ్చారు.

అయితే జాతీయ భ‌ద్ర‌త‌కు సంబంధించిన ఎలాంటి స‌మాచారాన్ని తాము అడ‌గ‌డం లేద‌న్న విష‌యాన్ని కోర్టు మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. ఈ కేసులో విచార‌ణ కొన‌సాగ‌నుంది. పెగాస‌స్ వివాదంపై అఫిడ‌విట్ దాఖ‌లు కోసం ఈ నెల 7న కేంద్రానికి కోర్టు మ‌రింత స‌మ‌యం ఇచ్చింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/