మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఎందుకు లేదు?

విధ్వంసాలకు పాల్పడటం వైయస్సార్ కుటుంబానికి అలవాటే

అమరావతి : అమలాపురంలో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారంటే అది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఇళ్లు తగలబడుతుంటే ఒక్క ఫైరింజన్ కూడా రాలేదని… అమలాపురంలో ఫైరింజన్లు లేవా? అని అడిగారు. ఫైర్ ఇంజిన్లు కూడా రాలేదంటే… ఈ విధ్వంసానికి పాల్పడింది వైస్సార్సీపీ శ్రేణులే అని అర్థమవుతోందని అన్నారు.

అమలాపురంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో వేలాది మంది రోడ్లపైకి ఎలా వచ్చారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. విధ్వంసాలకు పాల్పడటం వైయస్సార్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖరరెడ్డి చనిపోతే… రిలయన్స్ వాళ్లు చంపేశారని వాళ్ల ఆస్తులను ధ్వంసం చేయించింది జగన్ కాదా? అని అడిగారు. తునిలో రైలును తగలబెట్టింది వైస్సార్సీపీ వాళ్లు కాదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి కోసం కోడికత్తి డ్రామా ఆడింది ఎవరని నిలదీశారు. సొంత బాబాయిని ఇంట్లోనే చంపించి, ఎవరో చంపినట్లు సృష్టించిన వ్యక్తి జగన్ కాదా? అని ప్రశ్నించారు.

జగన్ పై, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడల్లా ఏదో ఒక విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి, అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి ప్రజల్లో మంచి స్పందన వస్తోందని… అందుకే ప్రజల దృష్టి మరల్చేందుకు అమలాపురంలో విధ్వంసానికి పాల్పడ్డారని విమర్శించారు. ఇంత జరిగినా సీఎం జగన్ స్పందించకపోవడం దారుణమని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/