విమానాల్లో 12 ఏళ్ల‌లోపు చిన్నారుల‌కు వారి పేరెంట్స్ ప‌క్క‌నే సీటు ఇవ్వాలిః డీజీసీఏ ఆదేశాలు

DGCA’s new guidelines mandate seats for children below 12 years near parents

న్యూఢిల్లీః విమాన‌యాన సంస్థ‌ల‌కు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) కీల‌క ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్ల‌లోపు వారికి అదే పీఎన్ఆర్ నంబ‌ర్‌పై ప్ర‌యాణిస్తున్న త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కుల్లో ఒక‌రి ప‌క్క‌న సీటు కేటాయించాల‌ని సూచించింది. ఫ్లైట్స్‌ల్లో కొన్నిసార్లు పేరెంట్స్‌తో కాకుండా చిన్నారుల‌కు వేరుగా సీటు కేటాయిస్తున్న ఉదంతాల నేప‌థ్యంలో డీజీసీఏ ఈ ఆదేశాలిచ్చింది. ఈ మేర‌కు నిబంధ‌న‌లు స‌వ‌రిస్తూ స‌ర్క్యూల‌ర్ జారీ చేసింది.

అలాగే దీనికి సంబంధించిన రికార్డుల‌ను కూడా నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. దీంతో పాటు ఎయిర్‌లైన్ల‌కు సంబంధించి కొన్ని వెసులుబాట్లు కూడా క‌ల్పించ‌డం జ‌రిగింది. సీట్ల ప్రాధాన్యం, సంగీత వాయిద్య ప‌రిక‌రాలు తీసుకెళ్ల‌డం, జీరో బ్యాగేజీ, మీల్స్, డ్రింక్స్, స్నాక్స్ వంటి వాటికి ఫీజులు వ‌సూలు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. అయితే, ఈ రుసుములు ఐచ్ఛికంగా ఉండాల‌ని, త‌ప్ప‌నిస‌రి చేయ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. సాధార‌ణంగా విమానాల్లో వెబ్ చెక్‌-ఇన్ ఆప్ష‌న్ ఉంటుంది. ఆ స‌మ‌యంలో ప్ర‌యాణికుడు త‌మ‌కు నచ్చిన సీటును ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక‌వేళ ఏ సీటూ ఎంచుకోక‌పోతే వారికి ఆటో సీట్ అసైన్‌మెంట్ రూల్ వ‌ర్తిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా డీజీసీఏ గుర్తు చేసింది.