మేడారం జాతరలో పోలీసుల ఓవరాక్షన్‌ పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం

మేడారం జాతరలో పోలీసుల ప్రవర్తిస్తున్న తీరు పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతరలో విధులు నిర్వహిస్తున్న డ్యూటీ పోలీసులు వారి కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డ్యూటీలో ఉన్న పోలీసులు ప్రధాన గద్దెలపైకి వారి కుటుంబాలను పంపిస్తున్నారు. డ్యూటీలు వదిలి మరీ పోలీసులు దర్శనానికి ఎగబడుతున్నారు.

పదే పదే మైక్‌లో అనౌన్స్‌మెంట్ చేస్తున్నప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, వారి కుటుంబాలు జాతరలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. వీవీఐపీ వాహనాలను పార్కింగ్‌కు అనుమతించకున్నా… పోలీసుల పర్సనల్ వాహనాలకు మాత్రమే డ్యూటీ పోలీసులు అనుమతి ఇస్తుండం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇక నిన్న రాత్రి సమ్మక్క గద్దెపైకి చేరుకుంది.

ఇక జాతర సందర్భంగా నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటించారు. ఈ సెలవు కేవలం విద్యాసంస్థలకు మాత్రమే ఉంటుందని, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్లు పేర్కొన్నారు. ఈరోజు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చినందున మార్చి 9న వర్కింగ్ డే ఉంటుందని తెలిపారు. ఇక ములుగు జిల్లాలో మాత్రం విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకూ హాలిడే ఉంది.