హైదరాబాద్ లో అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందిః భట్టి విక్రమార్క

దేశాన్ని బిజెపి మతపరంగా విడదీస్తోందన్న భట్టి విక్రమార్క

Bhatti Vikramarka

హైదరాబాద్‌ః బిజెపి, బిఆర్ఎస్ రెండూ ప్రమాదకరమైన పార్టీలని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దేశాన్ని బిజెపి మతపరంగా విడదీస్తుంటే… తెలంగాణలోని ప్రభుత్వ భూములను బిఆర్ఎస్ ప్రభుత్వం అమ్మేస్తోందని విమర్శించారు. 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని బిఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, కాంగ్రెస్ హయాంలో కట్టిన వాటినుంచే విద్యుత్ ఇస్తున్నారని చెప్పారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రాద్రి, యాదాద్రి రెండు విద్యుత్ ప్లాంట్లను చేపట్టారని…. యాదాద్రి ప్లాంట్ లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదని అన్నారు.

హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని చెప్పారు. హైదరాబాద్ కు నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన కోరిక అని రాజశేఖరరెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలను విజయవంతం చేయాలని కోరారు.