రికార్డు స్థాయిలో మేడారం ఆదాయం

మేడారం జాతర హుండీల లెక్కింపు ముగిసింది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో జాతరలో ఏర్పాటు చేసిన 518 హుండీలను గత పది రోజులుగా లెక్కింపు చేపట్టగా..నిన్నటితో లెక్కింపు ముగిసింది. ఈ లెక్కింపు లో రూ.12,71,79,280 వచ్చాయి. గతంలో కన్నా ఇది రూ.26,29,553 ఎక్కువ కావడం గమనార్హం. మరోవైపు 800 గ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి భక్తుల నుంచి కానుకగా వచ్చింది. నాణేల లెక్కింపు కొనసాగుతోంది. ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు హెచ్‌డీఎఫ్‌సీ, యూనియన్‌, కెనరా బ్యాంకుల్లో జమ చేశారు.

దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్రీకాంతరావు, ములుగు ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రామల సునీత, మేడారం జాతర ఈవో రాజేంద్రం, జాతర పూజారుల పర్యవేక్షణలో హుండీల లెక్కింపు ప్రక్రియ సాగింది. దేవాదాయ శాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలకు చెందిన సుమారు 350 మంది లెక్కింపులో పాల్గొన్నారు. హుండీల లెక్కింపు ప్రక్రియ మరో నాలుగు రోజులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మేడారం జాతర హుండీల్లో ఆరు నోట్లు కలకలం సృష్టించాయి. అంబేద్కర్‌ ఫొటోతో ముద్రించిన ఆరు రూ.100 నోట్లను సిబ్బంది గుర్తించారు. గాంధీ ఫొటో ఉండాల్సిన స్థానంలో అంబేద్కర్‌ ఫొటో ముద్రించిన వంద రూపాయల నోట్లను భక్తులు హుండీల్లో వేశారు. ఈ నోట్లపై అంబేద్కర్‌ ఫొటోతో వంద రూపాయల నోట్లను ముద్రించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ను డిమాండ్‌ చేస్తూ నోట్‌ రాయడం చర్చనీయాంశంగా మారింది.