ఢిల్లీ మద్యం కుంభకోణం అబద్ధం,..కేజ్రీవాల్

స్కామ్ పేరుతో ఆప్‌ని కించపరిచేందుకు బిజెపి చేస్తోందని ఆరోపణ

‘Delhi liquor scam false, even court saying it’: Arvind Kejriwal as 2 accused get bail in case

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం అబద్ధమని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడు కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. ఈ కేసులో అరెస్టు అయిన రాజేశ్‌ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. లంచం కింద డబ్బు చెల్లించినట్లు కానీ, తీసుకున్నట్లు కానీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎలాంటి సాక్ష్యాధారాలు చూపలేకపోయిందని జడ్జి వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ఈరోజు స్పందించారు. ‘‘లిక్కర్‌ స్కామ్ మొత్తం అబద్ధం. మేం ముందు నుంచి ఈ విషయం చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఆప్ లాంటి నిజాయితీ గల పార్టీని అపఖ్యాతి పాలు చేసేందుకు బిజెపి చేస్తున్న కుట్ర ఇది’’ అని విమర్శించారు. ‘‘లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్‌కు సంబంధించిన సాక్ష్యం లేదని ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది. మద్యం కుంభకోణం అంతా బూటకమని, కేవలం ఆప్‌ని కించపరిచేందుకేనని మేము మొదటి నుంచి చెబుతున్నాం’’ అని అంతకుముందు ఓ ట్వీట్ చేశారు.