భారత్ అమెరికాకు మిత్రదేశంగా ఉండదు..మరో గొప్ప శక్తి అవుతుందిః అమెరికా

India will not be an ally of US, it will be another great power, says White House official

వాషింగ్టన్‌ః భారత్ మరో సూపర్ పవర్గా అవతరిస్తుందని వైట్‌హౌస్ ఆసియా కో ఆర్డినేటర్ కర్ట్ క్యాంప్‌బెల్ అన్నారు. భారత్కు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నారు. గత 20 ఏళ్లలో అమెరికా, భారత్‌ సంబంధాలు బలపడిన స్థాయిలో మరే దేశంతో ద్వైపాక్షిక బంధం మెరుగుపడలేదని చెప్పారు. తన దృష్టిలో 21వ శతాబ్దంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక బంధం భారత్‌తోనే ఉందన్నారు. ఆస్పెన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ మీటింగ్‌ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కర్ట్ క్యాంప్‌బెల్ ఈ విధంగా స్పందించారు.

అమెరికా మరింత దృష్టిపెట్టి ఇరు దేశాల ప్రజల మధ్య బంధాన్ని పెంచేలా టెక్నాలజీ, ఇతర అంశాలపై కృషి చేయాలని క్యాంప్‌బెల్‌ అన్నారు. ‘‘భారత్‌ లో విభిన్నమైన వ్యూహాత్మక లక్షణం ఉంది. అది అమెరికా మిత్రదేశంగా ఉండబోదు. మరో గొప్పశక్తిగా అవతరిస్తుంది. ప్రతి దశలోనూ వివిధ అంశాల్లో ఇరు దేశాల బంధం మరింత బలపడటానికి చాలా కారణాలున్నాయి. ఖగోళ, విద్యా, పర్యావరణ, సాంకేతిక రంగాలేవైనా.. మేము చాలా అంశాలను సమష్టిగా చేయగలిగిన కోణంలోనే చూస్తాం. గత 20 ఏళ్ల బంధంలో చాలా అడ్డంకులను తొలగించుకొన్నాం. ఇందుకోసం ఇరువైపులా లోతుగా కృషి చేశాం’’ అని కర్ట్ క్యాంప్‌బెల్ వ్యాఖ్యానించారు.

భారత్‌, అమెరికా బంధం చైనాను ఆందోళనకు గురి చేయడానికి ఏర్పడింది కాదని క్యాంప్‌బెల్‌ పేర్కొన్నారు. ఇది సమష్టి కృషి ప్రాముఖ్యాన్ని రెండు దేశాలు లోతుగా అర్థం చేసుకోవడం వల్ల ఏర్పడిందని వెల్లడించారు. క్వాడ్‌ విషయంలో తాను సానుకూలంగా ఉన్నానని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్వాడ్‌ను లీడర్ స్థాయికి పెంచాలని నిర్ణయించినప్పుడు భారతీయులు సందిగ్ధతతో ఉన్నారని క్యాంప్ బెల్ అంగీకరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/