మంత్రి కెటిఆర్ కు మరో అంతర్జాతీయ సదస్సు నుంచి ఆహ్వానం

జర్మనీలో జూన్12–15 మధ్య జరగనున్న సదస్సు

minister-ktr-invites-for-for-asia-berlin-summit

హైదరాబాద్‌ః తెలంగాణ మంత్రి కెటిఆర్ కు మరో అంతర్జాతీయ సదస్సు నుంచి ఆహ్వానం అందింది. జర్మనీలో ఈ ఏడాది జూన్ 12 నుంచి 15 వరకు జరిగే ఏషియా బెర్లిన్ సమ్మిట్–2023కి రావాలని మంత్రి కెటిఆర్ కు ఆహ్వానం అందింది. ‘కనెక్టింగ్ స్టార్టప్ ఇకో సిస్టం’ అనే అంశంపై సమ్మిట్ జరగనుంది. జర్మనీ సెనేట్ కు చెందిన ఎకనామిక్స్, ఎనర్జీ, పబ్లిక్ఎంటర్ప్రైజేస్ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహించనుంది. ఇందులో పాల్గొని ప్రసంగించాలని కెటిఆర్ కు వచ్చిన ఆహ్వాన పత్రికలో కోరింది.

ఈ సంవత్సరం జరిగే సదస్సు మొబిలిటీ, లాజిస్టిక్స్, ఎనర్జీ, గ్రీన్ టెక్, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రధానమైన అంశాలను విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో భాగంగా పెట్టుబడిదారులకు ప్రత్యేకమైన సెషన్ ఉంటుందని, అద్భుతమైన ఆలోచనలున్న స్టార్టప్ కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. కాగా, ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరుకావాలంటూ కెటిఆర్ కు ఇప్పటికే ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే.