పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా CV ఆనంద బోస్ ప్రమాణం

పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా సీవీ ఆనంద బోస్ బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు న్యాయమూర్తి ప్రకాశ్ శ్రీవాస్తవ.. ఆనంద బోస్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమానికి బెంగాల్ సీఎం మమత బెనర్జీ, స్పీకర్ బిమన్ బెనర్జీ, మంత్రులు హాజరయ్యారు. 1977 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ మాజీ అధికారి ఆనంద బోస్ . భారత ప్రభుత్వ కార్యదర్శిగా, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన కార్యదర్శిగా ఆయన గతంలో పనిచేశారు. అలాగే యూనివర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా కూడా పని చేశారు. ఆనంద బోస్ మంచి రచయిత కూడా.

ఆయన ఇంగ్లీష్‌, హిందీ, మళయాళ భాషల్లో 32 పుస్తకాలు రచించారు. ఇంతకు ముందు గవర్నర్‌గా వ్యవహరించిన జగదీప్‌ ధనకర్‌ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో… గత జూలై నుంచి మణిపూర్‌ గవర్నర్‌ గణేశన్‌… బెంగాల్‌ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. మమతా బెనర్జీ సర్కారు, ధనకర్‌ మధ్య తీవ్ర వివాదాలు నడిచాయి. ధనకర్‌లాగే వ్యవహరించే గవర్నర్‌ త్వరలోనే రాష్ట్రానికి వస్తారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన నేపథ్యంలో… కొత్త గవర్నర్‌ బోస్‌ ఎలా వ్యవహరిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది .