సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అరెస్టు

CPI leader Ramakrishna
CPI leader Ramakrishna

సీపీఐ నేడు ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను బుధువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులను ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమావేశాన్ని నగరంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు.

సమావేశం అనంతరం బయటకు వస్తున్న ఆయనను పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించారు. అడ్డుపడిన నాయకులను, రామకృష్ణను నంద్యాల రెండవ పట్టణ స్టేషన్‌కు తరలించారు. ఆయన అరెస్టును సిపిఎం నంద్యాల జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ ఓ ప్రకటనలో ఖండించారు. టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాల సమస్యపై ప్రజల తరపున పోరాడుతుంటే అరెస్టు చేయడం సిగ్గుచేటని, వెంటనే రామకృష్ణను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

పూర్తయిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని, జగనన్న ఇళ్ల నిర్మాణాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్న డిమాండ్‌తో సీపీఐ ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రామకృష్ణను అరెస్ట్ చేయడంతోపాటు ఆ పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.