అమరావతికి జై కొట్టిన వైస్సార్సీపీ ఎమ్మెల్యే

వైస్సార్సీపీ అధినేత , సీఎం జగన్ ఏపీ రాజధాని అమరావతి కాదని వైజాగ్ అని అంటుంటే..అదే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం తన మద్దతు అమరావతికే అని తేల్చి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వైస్సార్సీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని ఘంటాపథంగా చెబుతుండగాఎన్టీఆర్ జిల్లా మైలవరం వైస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ మాత్రం వ్యక్తిగతంగా తన ఓటు అమరావతికేనని స్పష్టం చేశారు. అయితే తాను ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బుధువారం వసంత వెంకటకృష్ణప్రసాద్ కవులూరులో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రాంబాబు ఆయనతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతిపై మీరెందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రాజధానిపై ప్రజల్లో అయోమయం నెలకొనడంతో తమ భూముల ధరలు పతనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులు ఎవరని ఎమ్మెల్యేను ఆయన ప్రశ్నించారు. స్పందించిన వసంత వెంకటకృష్ణ ప్రసాద్.. వ్యక్తిగతంగా తన మద్దతు అమరావతికేనని, కాకపోతే ప్రభుత్వ విధానానికే తాను కట్టుబడి ఉండాల్సి ఉంటుందని, ఈ విషయంలో తాను చేసేదేమీ లేదని స్పష్టం చేశారు.

మరోవైపు ఈరోజు రాజధాని అమరావతి అంశం సుప్రీం కోర్టులో ప్రస్తావనకు రానుంది. అమరావతికి సంబంధించిన కేసులు త్వరితగతిన విచారణ జాబితాలో చేర్చాలంటూ సుప్రీం కోర్టులో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించనుంది. అమరావతి కేసులను విచారణ జాబితాలో త్వరగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి గత సోమవారమే జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ప్రస్తావించిన విషయం తెలిసిందే.