కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పధకంలోకి చేర్చింది. రాష్ట్రంలో ‘ఆరోగ్యశ్రీ ప్లస్ ఆయుష్మాన్‌ భారత్‌’ పేరిట ఈ పథకం అమలుకానుంది. కరోనాకు అందించే చికిత్సలను మొత్తంగా 17 రకాలుగా విభజించి ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చేర్చారు. ఇందులో ‘అక్యూట్‌ ఫెబ్రైల్‌ ఇల్‌నెస్‌’.. ‘పైరెక్సియా ఆఫ్‌ అన్‌నోన్‌ ఆరిజిన్‌’.. ‘నిమోనియా’ ఉన్నాయి. వీటితోపాటు మిగిలిన 14 రకాలకు ప్రభుత్వాసుపత్రులలోనే వైద్యం అందిస్తారు. అయితే తొలిదశలో దీనిని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేయగా దశలవారీగా ప్రైవేటు ఆస్పత్రులకు విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులకే ఈ పధకం పరిమితం చేయడంతో అర్హులైన కరోనా రోగులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం నేరుగా ఆయా సర్కార్ ఆసుపత్రులకు అందజేయనుంది. మరోవైపు ఆరోగ్య శ్రీ పధకం కింద రూ. 2 లక్షల వరకు కవరేజీ.. ఆయుష్మాన్ భారత్ కింద రూ. 5 లక్షల వరకు కవరేజీ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని 642 చికిత్సలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. అతి సాధారణ జ్వరం, మలేరియా, డెంగీ, గన్యా వంటి విష జ్వరాలతో పాటు డయేరియా, అక్యూట్‌ గ్యాస్ట్రో ఎంటరైటిస్‌, వడదెబ్బ, పాముకాటు, కుక్కకాటు, నిమోనియా, సెప్టిక్‌ ఆర్థరైటిస్‌, పిల్లల్లో కారణం తెలియని కడుపునొప్పి, నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో రెటినోపతి జబ్బు వస్తే అందించే లేజర్‌ థెరపీ, హెచ్‌ఐవీ, దాని అనుబంధ సమస్యలు, రక్త మార్పిడి, ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌ వంటి జబ్బులకు ఉచిత చికిత్స లభిస్తుంది. మెంటల్‌ రిటార్డియేషన్‌, న్యూరాలజీ స్ట్రెస్‌ రిలేటెడ్‌ డిజార్డర్స్‌ వంటి మానసిక రుగ్మతలూ వంటివి ఆరోగ్యశ్రీలోకి చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.