హుజురాబాద్ ఉప ఎన్నిక : కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో అధికారికంగా ఈరోజు తేలనుందా..?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నిక వేడి కొనసాగుతుంది. బిజెపి నుండి ఈటెల బరిలోకి దిగడంతో తెరాస పార్టీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ఈ ఉపఎన్నికలో గెలిచి ఈటెల రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయాలనీ చూస్తుంది. అందుకే గతంలో ఎక్కడ లేని విధంగా ఈ నియోజకవర్గంలో నిధులు , పలు పధకాలు తీసుకొస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు బిజెపి , తెరాస పార్టీల అభ్యర్థులు ఖరారు కాగా..కాంగ్రెస్ నుండి ఎవరు అనేది ఇంకా ప్రకటన రాలేదు.

ప్రస్తుతం మాత్రం మాజీ మంత్రి కొండా సురేఖ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా చేయలేదు. అయితే హైదరాబాద్‌ వచ్చిన ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మణికం ఠాగూర్.. ఈరోజు గాంధీ భవన్‌లో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా గజ్వేల్ సభ, హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ చర్చల అనంతరం సురేఖ పేరు ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు చెపుతున్నారు.