మళ్లీ దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా

కరోనా మహమ్మారి మరోసారి దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళలో కొత్త వేరియంట్ కేసులు రెట్టింపవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కరోనాతో ఐదుగురు చనిపోగా.. వీటిలో నాలుగు మరణాలు కేరళలోనే నమోదయ్యాయి. ఇండియా సహా 38 దేశాల్లో కొత్త వేరియంట్ JN-1 గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాలకు సూచించింది.

ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు వైద్య శాఖ అప్రమత్తంగా ఉంటూనే, అన్నిరకాలుగా సంసిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సిహ సూచించారు. రాబోయే రోజులు పండుగల సీజన్‌ కావడంతో ప్రజలు శ్వాసకోశ పరిశుభ్రతను పాటించాలని, అవసరమైన మేరకు మాస్కులను ధరించాలని సూచించారు. వృద్ధులు, శ్వాసకోస సంబంధిత సమస్య ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరమైన ప్రజారోగ్య చర్యలు, ఇతర ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించారు.

కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు తెలంగాణ యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. తగినన్ని కోవిడ్19 వ్యాధి నిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని మంత్రి దామోదర రాజనర్సింహ వివరించారు. కేంద్రం సూచనలతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని, చలికాలం సమస్యలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, సమస్యలు తలెత్తం సహజమేనన్నారు. అయితే కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్నందున పరిశుభ్రత పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి సూచించారు.