కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ఈ నెల 28వ తేదీ నుంచి తెలంగాణ సరికొత్త కార్యక్రమానికి కాంగ్రెస్ అధిష్టానం శ్రీకారం చుట్టింది. తెలంగాణలో ఆరోజు నుంచి గ్రామసభలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. గాంధీ భవన్‌లో సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం ఈ గ్రామ సభలను చేపట్టనున్నారు.

కాంగ్రెస్ 6 గ్యారంటీల కోసం 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అందులో భాగంగానే గ్రామసభల ద్వారా ఈ దరఖాస్తులను స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇటు పార్టీ తరుపున, అటు ప్రభుత్వం తరుపున ప్రతినిధులను నియమించి గ్రామ సభలను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆ సభ ద్వారానే దరఖాస్తులు స్వీకరించి.. అందరి ఆమోదం తెలిపిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు.