భారత్ కు 113 కోట్ల భారీ సాయాన్ని ప్రకటించిన గూగుల్

80 ఆక్సిజన్ల ప్లాంట్ల నిర్మాణం, గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల శిక్షణపై దృష్టి

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ భారత్ కు రూ.113 కోట్లు అందిస్తామని గురువారం ప్రకటించింది. ముఖ్యంగా హెల్త్‌ వర్కర్లకు అదనపు శిక్షణ, గ్రామీణ ప్రాంతాల్లోఆరోగ్య సౌకర్యాల మెరుగు, సుమారు 80 ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణం కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు తెలిపింది. గివ్ఇండియా, పాత్ సంస్థలకు ఈ నిధులను అందించనుంది. ఈ రెండు సంస్థలు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తాయి. అలాగే ప్రాజెక్ట్ నిర్వహణ సహాయాన్ని అందిస్తాయి. సంబంధిత టార్గెట్‌ ఏరియాలను గుర్తించి, వాటిని సాంకేతిక సహాయాన్ని అందించడంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు,ఇతర అధికారులతో పని చేస్తుంది. అలాగే అపోలో మెడీ స్కిల్స్‌ ఇనీషియేటివ్‌తో కలిసి, 20వేల మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల శిక్షణా కోసం పెట్టుబడులు పెడుతుంది. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలకు, ఆరోగ్య వ్యవస్థలకు సహాయం చేయడమే లక్ష్యమని గూగుల్‌ ఆర్గ్‌ వెల్లడించింది. దీంతోపాటు ఆశా, ఎఎన్‌ఎం వర్కర్ల శిక్షణా నిమిత్తం ఏకంగా రూ. 3.6 కోట్లు (5 లక్షల డాలర్లు) గ్రాంట్‌ను అందివ్వనుంది. తద్వారా 15 రాష్ట్రాలలో లక్షా 80వేల ఆశా వర్కర్లకు, 40వేల ఎఎన్‌ఎంలకు అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేయనుంది.


కాగా, కరోనా సంక్షోభంలో విలవిల్లాడిన బాధితులకు సానుభూతి ప్రకటించిన గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ కష్ట కాలంలో భారతీయులకు సాయం చేసేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. ముఖ్యంగా ఆక్సిజన్‌ ప్లాంట్లనిర్మాణం, గ్రామీణ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల శిక్షణపై దృష్టిపెట్టామని ట్వీట్‌ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/