అమిత్ షా వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్

చేవెళ్ల సభ వేదికగా కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా అన్నారు. వాటిని ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కేటాయిస్తామని .. ఒవైసీ అజెండాపై సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని.. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు. మజ్లిస్ అంటే తమకు భయం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు.
ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగం చేయడం తప్ప.. తెలంగాణపై బీజేపీకి ఎటువంటి విజన్ లేదని ఓవైసీ అన్నారు. ఆయన తన ట్విట్టర్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ.. ఓవైసీ అంటూ మీరింకెన్నాళ్లు రోదిస్తుంటారని, ఉత్త డైలాగులు ఎన్నాళ్లు చెబుతారని, కొన్ని సార్లు వాస్తవాలు కూడా మాట్లాడాలన్నారు. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో ఉందని, నిరుద్యోగం కూడా తారస్థాయికి చేరినట్లు ఓవైసీ ఆరోపించారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
దళిత ముస్లింలను ఆదరించాలని ప్రధాని మోదీ చెబుతుంటారని, కానీ వాళ్ల రిజర్వేషన్లను తొలగించాలని అమిత్ షా మాట్లాడడం శోచనీయమని ఓవైసీ అన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు చేయడం తప్ప.. తెలంగాణ వృద్ధిపై బీజేపీకి విజన్ లేదన్నారు. ఫేక్ ఎన్‌కౌంటర్లు చేయడం.. హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ చేయడం, కర్ఫ్యూలు పెట్టడం, క్రిమినల్స్‌ను వదిలేయడం, బుల్డోజర్లను దింపడమే ఆ పార్టీకి తెలుసు అని ఓవైసీ ఆరోపించారు. తెలంగాణ ప్రజల్ని ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారని షాను ఓవైసీ ప్రశ్నించారు.