కాసేపట్లో మేడిగడ్డకు రేవంత్.. నల్గొండకు కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు సీఎం రేవంత్ సహా అధికార పక్ష ఎమ్మెల్యేలంతా వెళ్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను KRMBకి అప్పగిస్తుందంటూ నిరసిస్తూ BRS నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. దీంతో పరస్పర విమర్శలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

కుంగిన మేడిగడ్డ బ్యారేజీని డైరెక్టుగా కాంగ్రెస్ నేతలు పరిశీలించి… అక్కడే పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయనున్నారు.. తర్వాత అధికారులతో సమీక్ష కూడా జరపనున్నారు. ఈ మేరకు పర్యటన తాలూకా వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం అసెంబ్లీ మొదలయ్యాక, 9.30కి అసెంబ్లీ నుంచే బస్సులు బయలుదేరతాయి. మధ్యాహ్నం 2 తర్వాత మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. ఓ గంటపాటూ బ్యారేజ్ సందర్శన ఉంటుంది. తర్వాత 3 నుంచి 4 గంటల వరకూ నీటి పారుదల శాఖ సమీక్ష ఉంటుంది. తర్వాత సాయంత్రం 4 నుంచి 7 గంటల సమయంలో మీడియా సమావేశం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు మేడిగడ్డ నుంచి హైదరాబాద్‌కి రిటర్న్ జర్నీ ఉంటుంది.

ఇదిలా ఉంటె కృష్ణా జలాల్లో న్యాయమైన హక్కులను కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ మరోసారి సమరశంఖం పూరిస్తున్నారు. కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభకు స్వయంగా హాజరై ఆయన తన సందేశం వినిపించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న ఈ బహిరంగసభకు దాదాపు రెండు లక్షల మంది ప్రజలు తరలివస్తారన్న అంచనాలున్నాయి. నల్లగొండ పట్టణ శివారులో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్‌లో విశాలమైన స్థలంలో ఈ సభ జరగబోతుంది. మరి ఈ సభలో కేసీఆర్ ఏమాట్లాడతారో..కాంగ్రెస్ ప్రభుత్వం ఫై ఇలాంటి విమర్శలు చేస్తారో చూడాలి.