బహిరంగ మార్కెట్లోకి కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు !

షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని సీడీఎస్‌సీవో సిఫార్సు
డీసీజీఐ అనుమతి లభించిన వెంటనే మార్కెట్లోకి

న్యూఢిల్లీ: ఇకనుండి కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలను మందుల షాపుల్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ రెండు టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతి ఉంది. ప్రస్తుతం మన దేశంలో చురుగ్గా జరుగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో వీటినే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వీటిని బహిరంగ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు అనుమతివ్వాలంటూ ఈ రెండు సంస్థలు విడివిడిగా భారత ఔషధ నియంత్రణ మండలి డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి.

వీటి అభ్యర్థనను పరిశీలించేందుకు బుధవారం సమావేశమైన సీడీఎస్‌సీఓ నిపుణుల కమిటీ కొన్ని షరతులతో ఈ రెండు టీకాలను బహిరంగ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. తుది ఆమోదం కోసం ఈ సిఫార్సులను డీసీజీఐకి పంపిస్తారు. అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ రెండు టీకాలు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/