ఏపీలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదుః రోజా

షర్మిల రాకతో మరో నాన్ లోకల్ పొలిటీషియన్ వచ్చినట్టే అన్న రోజా

Roja

అమరావతిః ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన షర్మిల రోజుల వ్యవధిలోనే తనదైన మార్క్ ను ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా అధికార వైఎస్‌ఆర్‌సిపిని ఆమె టార్గెట్ చేస్తున్నారు. తన అన్నను జగన్ రెడ్డీ అని సంబోధిస్తూ ఆమె చేస్తున్న విమర్శలు వైఎస్‌ఆర్‌సిపి శిబిరంలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు వైఎస్‌ఆర్‌సిపి కీలక నేతలు ఆమె వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తాజాగా మంత్రి రోజా మాట్లాడుతూ షర్మిలపై విమర్శలు గుప్పించారు. ఏపీకి షర్మిల రావడం అనేది… మరో నాన్ లోకల్ పొలిటీషియన్ వచ్చినట్టేనని ఆమె ఎద్దేవా చేశారు. వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారని… జగన్ ను కాంగ్రెస్ పార్టీ 16 నెలలు జైల్లో పెట్టించిందని మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్ లో షర్మిల ఎలా చేరిందని ప్రశ్నించారు. ఏపీలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. తన నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్ క్యాంప్ ను ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

నగరి నియోజకవర్గంలో 14వ సారి పింక్ బస్ క్యాంప్ ద్వారా మహిళల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నామని రోజా తెలిపారు. ప్రతి మహిళ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని… క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జగన్ పాలనలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు.