ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంకా గాంధీని ఏ హోదాలో ఆహ్వానిస్తారు : ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha

హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.500లకే గ్యాస్ పథకం ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకాగాంధీని ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంకా గాంధీని ఏ హోదాలో ఆహ్వానిస్తారని ఆమె ప్రశ్నించారు. శనివారం కవిత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ నేతలను ఆహ్వానిస్తే నల్ల బెలూన్లు ఎగరేస్తామని స్పష్టం చేశారు. ఇంద్రవెల్లిలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితం అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. అమర వీరులకు కూడా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంద్రవెల్లిలో ఉదయం ప్రభుత్వ కార్యక్రమం జరిగితే సాయంత్రం పార్టీ సభ నిర్వహించారని పేర్కొన్నారు. ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. శుక్రవారం ఇంద్రవెల్లిలో జరిగిన సభ ఖర్చెంత? అని నిలదీశారు. `సీఎం రేవంత్ రెడ్డి చార్టర్డ్ ఫ్లైట్లలో ఢిల్లీకి వెళుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల ఖర్చు ఎంత?’ అని ప్రశ్నించారు.

తనకు కాన్వాయ్ అక్కర్లేదని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన కాన్వాయ్ హైదరాబాద్ నగరంలో వెళుతుంటే ట్రాఫిక్ జామ్ అవుతున్నదని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ‘మేం పాలనను వికేంద్రీకరించాలని కోరుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన పేరుతో కేంద్రీకరణ కోరుకుంటున్నది. ప్రజా దర్బార్ ఒక రోజు మురిపమే. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజే ప్రజా దర్బార్‌కు వచ్చారు. రాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన బాటనే కోరుకుంటున్నారు’ అని అన్నారు.
ప్రతి రోజూ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై ఏడ్చే సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో 22 కుటుంబాలకు పార్టీ టికెట్లు ఇచ్చారు. అటువంటప్పు కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన కాదా?` అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి ‘యూటర్న్ సీఎం’ అని రాష్ట్ర ప్రజలంతా అంటున్నారని అన్నారు. ప్రభుత్వ హామీలపై 100 రోజుల తర్వాత ప్రజా క్షేత్రంలో ఖచ్చితంగా నిలదీస్తాం అని స్పష్టం చేశారు.