వరదలతో కేరళ అతలాకుతలం..

వరదలతో కేరళ అతలాకుతలం అవుతుంది. తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట, అల్లపుజా, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వరదల కారణంగా నిన్న మరో ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 12కు పెరిగింది. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. ముగ్గురు జాలర్లు గల్లంతయ్యారు. 11 జిల్లాలకు చెందిన 2 వేలమందికిపైగా సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు.

రాష్ట్రంలో 23 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, 71 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరోవైపు, భారీ వర్షాల కారణంగా ఇడుక్కి, ముల్లపెరియార్ డ్యామ్‌లలో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. జలాశయాల్లో నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని చీఫ్ సెక్రటరీని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించారు. రాష్ట్రంలోని 9 జిల్లాలలో ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు మోహరించాయి. అలాగే, రెండు జిల్లాల్లో డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్‌ను మోహరించారు.