ప్రారంభమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు

counting-of-votes-in-five-states-begans

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కింపు కొనసాగనుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 1,200 కౌంటింగ్‌ హాళ్లను ఏర్పాటుచేశారు. వీటిలో 750కి పైగా ఒక్క యూపీలోనే ఉన్నాయి.

ఈ ఐదు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆసక్తి నెలకుంది. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీపైనే అందరి చూపూ ఉంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని మొత్తం 403 స్థానాలుండగా.. సాధారణ మెజార్టీ 202. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ యూపీలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అనధికారికంగా తరలిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ చేసిన ఆరోపణపై భారీ వివాదం చెలరేగడంతో వారణాసిలో ఈవీఎంల నోడల్ అధికారితో సహా ముగ్గురు అధికారులను తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించడానికి ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌ను మీరట్‌లో ప్రత్యేక అధికారిగా, బీహార్ సీఈఓను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటరీ స్థానమైన వారణాసిలో నియమించింది.

పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అధికార కాంగ్రెస్, ఆప్ మధ్యే హోరాహోరీ పోరు జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజార్టీకి అవసరమైన సీట్లు 59. ఉత్తరాఖండ్ లో మొత్తం 70 స్థానాలుండగా.. సాధారణ మెజార్టీకి 36 సీట్లు రావాలి. ఇక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయని పేర్కొన్నాయి. గోవాలోని మొత్తం 40 స్థానాలకు గానూ సాధారణ మెజార్టీకి 21 సీట్లు అవసరం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించినా.. తక్కువ స్థానాలు గెలిచిన బీజేపీ ఇతర పార్టీలతో కలిసి అధికారం చేపట్టింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/movies/