తెలంగాణాలో మరో నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

Congress

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు మరో జాబితాను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు మూడు విడతల్లో 13స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల్ని ప్రకటించింది. తాజాగా రిలీజ్ చేసిన జాబితాలో మొత్తం 14 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ స్థానాలకు సంబంధించి మొత్తం నాలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించారు.

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై మధ్యప్రదేశ్‌లోని గుణ స్థానం నుంచి రావ్ యద్వేంద్ర సింగ్‌కు అవకాశం ఇవ్వగా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ విదిశా నుంచి ప్రతాప్ భాను శర్మను పోటీకి దింపింది. ఇక తెలంగాణలో ఉన్న మొత్తం 17 స్థానాలకు గాను ఇప్పటికే 9 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయగా.. తాజాగా మరో నలుగురితో జాబితాను ప్రకటించింది.

ఆదిలాబాద్‌ నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డిని బరిలోకి దించింది. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసిన ఓటమి పాలైన సీనియర్‌ నేత జీవన్‌రెడ్డిని నిజామాబాద్‌ నుంచి పోటీ చేయించడంపై సీఈసీలో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఇక మిగిలిన ముగ్గురు అభ్యర్థులు లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.

పటాన్‌చెరు కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కినట్లే దక్కి చివరకు చేజారిన నీలం మధు బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు ఈసారి బీసీ కోటాలో మెదక్‌ టిక్కెట్‌ ఖరారైంది. ఇక ఆదిలాబాద్‌ నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణకు అవకాశం దక్కింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గుగా ఉన్న చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రమైన పోటీ మధ్య భువనగరి టిక్కెట్‌ దక్కించుకున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో కలిపి మొత్తం 13 స్థానాలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం అభ్యర్థుల్ని ప్రకటించింది.