ఢిల్లీలో ఒక్కోకార్మికుడికి రూ.5వేల సాయం: ఢిల్లీ సర్కారు

న్యూఢిల్లీః ఇప్పటికే పలు ఉపశమన చర్యలను చేపట్టిన కేజ్రీవాల్ సర్కార్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. నిర్మాణ పనులపై నిషేధం ఉన్నందున్న.. కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్మికులకు సహాయం అందించాలంటూ కార్మిక మంత్రి మనీష్ సిసోడియాను ఆదేశించారు. కాలుష్య స్థాయి అధ్వాన్నంగా ఉండటంతో, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో అవసరమైన ప్రాజెక్టులు మినహా నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం విధించారు. దీని వల్ల పనులు లేక ఇంటి వద్దే ఉంటున్న కార్మికులకు ఆర్థిక సహాయం అందించాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు.
ప్రైవేట్ వాహనాలే ఢిల్లీలో కాలుష్యానికి కారణమవుతున్నాయని ఇప్పటికే ఆప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. వీలైనంత వరకు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించింది. ప్రైవేట్ వాహనాల్లో ఆఫీస్‌లకు రావడాన్ని తగ్గించాలని చెప్పింది. ఢిల్లీ పరిధిలో కాలుష్య తీవ్రతను స్టేజ్-2గా ప్రకటించారు. ఇంకా కొద్ది రోజులు పరిస్థితులు ఇలాగే ఉంటే.. రెస్టారెంట్, హోటల్స్‌లో బొగ్గు, కట్టెలు కాల్చడంపైనా నిషేధం విధించనున్నారు. మొత్తం నాలుగు స్టేజ్‌లుగా కాలుష్య తీవ్రతను విభజించి, దానికి తగ్గట్టుగా తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం సూచించనుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/