కాటేదాన్‌ బిస్కట్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రవి బిస్కెట్‌ తయారీ పరిశ్రమలో (Ravi Biscuit Factory) గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి ఫ్యాక్టరీలోని మూడు అంతస్థులకు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్‌ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, మిషనరీ, బిస్కెట్ తయారీ ముడిసరుకు పూర్తిగా మంటల్లో కాలి బుడిదైంది. కోట్లల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు.