అవన్నీ పుకార్లే అంటున్న స్మిత సబర్వాల్

గత రెండు రోజులుగా ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ పేరు మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. బిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె.. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి పథకాలను పర్యవేక్షించారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 రోజులు గడుస్తున్నా ఇంతవరకు సీఎం రేవంత్ ను కలవకపోవడం ఫై సర్వత్రా చర్చ గా మారింది. ఇదే క్రమంలో ఆమె డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.

ఈ క్రమంలో ఆ వార్తలపై ఆమె స్పందించింది. కేంద్ర సర్వీసులకు వెళ్ళబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని , ఇవన్నీ నిరాధారమని పేర్కొన్నారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌గా తాను రాష్ట్రంలోనే కొనసాగుతానని, ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో విధి నిర్వహణ తనకెంతో గర్వకారణమని పేర్కొన్నారు.