యాదాద్రిలో మహా సుదర్శన యాగం వాయిదా

హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి మార్చి 21న జరగాల్సిన మహా సుదర్శన నరసింహా యాగం (108 కుండలు) వాయిదా పడింది. మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణతో ప్రధాన ఆలయం, గర్భాలయా ప్రారంభోత్సవం యధావిధిగా జరగనుంది. పనులు పూర్తి కానందుననే సుదర్శన యాగం వాయిదా వేస్తున్నట్లు, తిరిగి మే నెలలో నిర్వహించనున్నట్లు ఆలయ ఏవో గీతా రెడ్డి తెలిపారు.

మరోవైపు యాదాద్రి దివ్యక్షేత్రం మహాకుంభ సంప్రోక్షణకు ముస్తాబవుతోంది. పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ యాద్రాది ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రారంభోత్సవం, అభివృద్ధి పనులపై సమీక్షించారు. కాగా, యాదాద్రిలో కృష్ణ శిలలతో లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. భక్తులకు మరపురాని మధురానుభూతి పంచేలా నిర్మిస్తున్నారు. యాదాద్రి కొండపై లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు శివాలయాన్ని పునర్నిర్మించారు. పరిసరాల్లోనే విష్ణు పుష్కరిణి, ప్రసాదాల తయారీ, విక్రయ సముదాయం, క్యూ కాంప్లెక్స్‌ కడుతున్నారు. బ్రహ్మోత్సవ మండపం నిర్మించారు. కొండపై ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేశారు. క్షేత్ర సందర్శనకు వచ్చే వీఐపీలు సేదతీరేందుకు రూ.3 కోట్లతో అతిథిగృహం, రూ.2.5 కోట్లతో ఈవో ఛాంబర్‌ నిర్మించారు. అంతేకాదు కొండ చుట్టూ పచ్చని మొక్కలు నాటి ఆహ్లాదకరంగా రూపొందిస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/