రాష్ట్రపతిని కలిసిన రాహుల్ బృందం
ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణ
Congress delegation meets President, demands sacking of MoS Ajay Mishra
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్ జాతీయ నేతలు ఈ రోజు ఉదయం కలిసి పలు అంశాలను వివరించారు. రాష్ట్రపతి భవన్లో కోవింద్‌ను కలిసిన ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బృందంలో రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా అన్నారు. లఖింపూర్ ఖేరీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ఆయన కోరారు. దేశంలో రైతులు, ఎస్సీలు, మహిళలకు న్యాయం జరగట్లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
రాష్ట్రపతితో భేటీ అనంతరం ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. లఖింపూర్ ఖేరి ఘటనలో నిందితుడి తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని తొలగించాలని, అప్పుడే నిష్పాక్షిక విచారణ సాధ్యమవుతుందని రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులు ఇద్దరితో దర్యాప్తు జరిపించాలని కోరామని తెలిపారు. లఖింపూర్ ఖేరిలో అక్టోబర్ 3న ఆందోళన నిర్వహిస్తున్న రైతులపై కేంద్రమంత్రి కుమారుడిదిగా భావిస్తున్న ఎస్యూవీ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించగా ఆపై జరిగిన అల్లర్లలో మరో నలుగరు మరణించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను యూపీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/