ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను మరికాసేపట్లో ఈడీ అధికారులు విచారించబోతున్నారు. ఈ క్రమంలో ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. అలాగే పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను దింపి, పరిసర ప్రాంతాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు కవితకు మద్దతుగా ఢిల్లీలో హోర్డింగులు, ఫ్లెక్సీలు వెలిశాయి. ‘బై బై మోదీ’ అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియాలో సైతం కవితకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలను ఈడీ, సీబీఐలతో వేధించి బీజేపీలో చేర్చుకుంటున్నారని విమర్శిస్తున్నారు. బీజేపీలో చేరితే ఏ కేసులు ఉండవని ఎద్దేవా చేస్తున్నారు.

ఈడీ విచారణ నేపథ్యంలో గురువారం సాయంత్రమే కవిత ఢిల్లీకి చేరుకున్నారు. తుగ్లక్ రోడ్ లోని కేసీఆర్ నివాసంలో కవిత బస చేశారు. ఈ ఉదయం 7.30 గంటలకు జాగృతి కార్యకర్తలకు ఆమె అల్పాహార విందు ఇచ్చారు. మరోవైపు తన చెల్లెలికి తోడుగా ఉండేందుకు కేటీఆర్ సైతం శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. అలాగే కవితకు మద్దతుగా మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేస్తారా? అనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. దీంతో ఏంజరగబోతుందనేది ఆసక్తి గా మారింది.