నేడు సైనిక లాంఛనాల మధ్య సంతోష్‌బాబు అంత్యక్రియలు

క‌ల్న‌ల్‌ను క‌డసారి చూసేందుకు భారీ జ‌న‌సందోహం

సూర్యాపేట: భారత్‌, చైనా ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహం రాత్రి సూర్యాపేటలోని ఆయన స్వగృహానికి చేరుకుంది. దీంతో సంతోష్‌బాబు పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు జ‌నం భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. ఆయన నివాసం ప‌రిస‌ర ప్రాంతాలు జన‌సందోహంగా మారాయి. గురువారం తెల్ల‌వారుజాము నుంచే క‌ల్న‌ల్ సంతోష్‌బాబు పార్థివదేహానికి జ‌నం నివాళులు అర్పిస్తున్నారు. జోహార్ సంతోష్‌బాబు అంటూ నినాదాలు చేస్తున్నారు. కాగా, క‌ల్న‌ల్ పార్థివ‌దేహాన్ని ఉదయం 10 గంటల వరకు ప్రజల సందర్శనార్థం సూర్యాపేట‌లోని ఆయ‌న నివాసంలో ఉంచి, అనంత‌రం ఆయ‌న స్వ‌స్థ‌లం కేసారం గ్రామానికి త‌ర‌లించ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.

సాయంత్రం కేసారం గ్రామంలో క‌ల్న‌ల్ పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌నున్నారు. అంత్య‌క్రియ‌ల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు బుధ‌వారం సాయంత్రమే ఆర్మీ జనరల్ మేజర్లతోపాటు ప‌లువురు ఆర్మీ ఉన్నతాధికారులు సూర్యాపేట‌కు చేరుకున్నారు. ఆర్మీ లాంఛనాల ప్రకారం క‌ల్న‌ల్‌ అంత్యక్రియలు జ‌రుగ‌నున్నాయి. కాగా, క‌ల్న‌ల్ వీర మ‌ర‌ణానికి సంతాప సూచకంగా ఇవాళ సూర్యాపేట పట్టణంలో వ్యాపార, వాణిజ్య వర్తక సంఘాలు స్వ‌చ్ఛంధంగా బంద్ పాటించనున్నాయి. అయితే కరోనా నేప‌థ్యంలో అంద‌రూ ముఖాల‌కు మాస్కులు ధ‌రించి, సామాజిక దూరం పాటిస్తూ క‌ల్న‌ల్ పార్థివ దేహాన్ని సంద‌ర్శిస్తున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/