ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఎన్నికల్లో భారత్‌ విజయం

భారత్‌కు అనుకూలంగా 184 దేశాల ఓటు

India secures seat as non-permanent member of UN Security Council

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించింది. మొత్తం 193 సభ్య దేశాలున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో 192 దేశాలు ఓటింగులో పాల్గొనగా, భారత్‌కు అనుకూలంగా 184 దేశాలు ఓటేశాయి. ఫలితంగా మరోసారి తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఎన్నికైంది. భద్రతా మండలి శాశ్వత సభ్యత్వాన్ని కోరుకునే ప్రయత్నాలను కొనసాగిస్తున్న భారతదేశానికి.. 2021-22 కాలానికి కౌన్సిల్ లోకి ప్రవేశం పొందడం కీలకం.

భారత్ ఇలా ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి. 2021-22 కాలానికి భారత్‌ను ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఎన్నుకున్నట్టు భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి తెలిపారు. కాగా, భారత్‌తోపాటు ఐర్లండ్, మెక్సికో, నార్వే కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించాయి. కాగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం ఐదు శాశ్వత సభ్యదేశాలు, 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి. ప్రతి ఏడాది ఓటింగ్ ద్వారా తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నుకుంటారు. ఆసియా పసిఫిక్ వర్గానికి చెందిన సభ్యదేశంగా భార‌త్ ఎంపిక‌య్యింది. ఐరాస‌ భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా ఎంపికయ్యేందుకు భార‌త్‌ ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నది. అయితే, మండలిలోని నాలుగు శాశ్వత సభ్యదేశాలు ఇండియాకు అనుకూలంగా ఉన్నప్పటికీ చైనా వ్యతిరేకిస్తుండ‌టంతో భార‌త్‌ శాశ్వత సభ్యదేశంగా ఎంపిక కాలేకపోతున్న‌ది. 


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/