కీరవాణి స్టూడియోను సందర్శించిన సీఎం రేవంత్​ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్వరపరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఆదివారం రాయదుర్గంలోని కీరవాణి స్టూడియోకు వెళ్లారు. పాటలో మార్పులపై ఆయన కీరవాణికి, రచయిత అందెశ్రీకి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో గీతాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేయించనున్నారు.

ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ గేయంలో స్వల్ప మార్పులు, చేర్పులు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. అందులో జిల్లాల ప్రస్తావనతోపాటు మరికొన్ని అంశాలు ఉండడంతో వాటి స్థానంలో ఏయే అంశాలు ఉండాలి అన్నదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. తన సలహాదారుడు వేంనరేంద్ర రెడ్డితో కలిసి వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి ఆ పాటను ఒకటికి రెండు సార్లు విని అందులోని అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండడంతో గతంలో పది జిల్లాలు అన్న పదాన్నితొలిగించినట్లు సమాచారం. ఆ స్థానంలో ‘పద పద’ అన్నపదాన్ని చేర్చినట్లు తెలుస్తోంది.

మొత్తానికి ‘జయజయహే’అన్న తెలంగాణ గేయం భవిష్యత్తులో ఏలాంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఉండేట్లు ప్రస్తుతం ఉన్న గేయాన్ని మార్చినట్లు తెలుస్తోంది. ఈ గేయం అన్ని అంశాలతో మొత్తం నిడివి 13 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని తక్కువ సమయంలో వాడుకునేందుకు రెండు నుంచి మూడు నిముషాలు నిడివి ఉండేట్లు అందులో ముఖ్యమైన అంశాలు ఉండేట్లు కూర్పు చేస్తున్నట్లు సమాచారం.