నేడు పంజాబ్ కు సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పంజాబ్ రాష్ట్రానికి వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం ఆయన నేడు ఉదయం హైదరాబాద్ నుంచి పంజాబ్ కు బయలుదేరనున్నారు. అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతా ఒకరకమైన రాజకీయ చిత్రం ఉంటే పంజాబ్‌ ఎన్నికల సంగ్రామం మాత్రం మరో రకంగా ఉంది. మిగతా అన్ని రాష్ర్టాల్లో బీజేపీ లేదా ఎన్డీఏ మిత్రపక్షాలు ప్రధాన పోటీదారుగా ఉంటే పంజాబ్‌లో మాత్రం ఇండియా కూటమిలోనే ప్రధాన పోటీ నెలకొన్నది. 13 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ కనిపిస్తున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షాలైన ఆమ్‌ ఆద్మీ పార్టీ – కాంగ్రెస్‌ మధ్యనే నెలకొన్నది. ఈ రెండు పార్టీలను ఎదుర్కొనేందుకు శిరోమణి అకాలీదళ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.

గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇక్కడ మెరుగైన ఫలితాలు సాధించింది. 13 సీట్లలో ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా పోటీ చేసిన శిరోమణి అకాలీదళ్‌ రెండు స్థానాలను, బీజేపీ రెండు స్థానాలను, ఆప్‌ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆప్‌ పంజాబ్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాయి. మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇతర రాష్ర్టాల్లో ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల బరిలో దిగినప్పటికీ పంజాబ్‌లో మాత్రం సీట్ల పంపిణీ కుదరకపోవడంతో వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి.