నేడు ఢిల్లీకి సీఎం రేవంత్..ప్రధాని తో భేటీ

CM Revanth Reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానంతోపాటు ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తదితరులను కలువనున్నారు. ఉదయం కాంగ్రెస్‌ పెద్దలను కలిసి మంత్రవర్గ విస్తరణ, ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

రేవంత్‌రెడ్డి సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ప్రధాని మోడీని సాయంత్రం మర్యాదపూర్వకంగా కలువనున్నారు. ఈ మేరకు అపాయింట్‌మెంట్‌ దొరికినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చిస్తారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై మోదీకి వివరించే అవకాశం ఉంది. రాజకీయంగా బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య బద్ధ విరోధం ఉన్న నేపథ్యంలో… రేవంత్ విన్నపాల పట్ల మోడీ ఏ మేరకు స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.