హుజురాబాద్‌లో దళిత బంధు సర్వే మొదలైంది

హుజురాబాద్‌లో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక సర్వే మొదలైంది. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దళిత బంధు సర్వే ను అధికారులు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్‎ను జిల్లా కలెక్టర్ కర్ణన్ అధికారులకు అందజేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 200 మంది వివిధ శాఖల ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. మొత్తం 48 అంశాలపై దళిత కుటుంబాల నుంచి వివరాలు అడిగి తెలుసుకోవాల్సి ఉంది. వారి కుటుంబ స్థితిగతులపై ఆరా తీసి ఎవరికి ఏ యూనిట్లు అవసరమో వాటినే ఆ కుటుంబానికి ఇచ్చేలా అధికారులు సర్వే చేయనున్నారు.

ఈ సందర్భంగా హుజురాబాద్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దళిత బంధు సర్వేలో రెవెన్యూ అధికారులకు తోడుగా బ్యాంకు అధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు. దళితుల సర్వే ద్వారా వివరించే అంశాలను పరిగణలోకి తీసుకొని వారికి ఏ పథకం వర్తిస్తుంది, వాటి వల్ల కుటుంబాలకు కలిగే ఆదాయం తదితర వివరాలను కూడా తెలియజేస్తామని మీడియా కు తెలిపారు. కాగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న 20,929 దళిత కుటుంబాలన్నింటికి ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ రెండు వేల కోట్ల రూపాయలను కలెక్టర్‌ ఖాతాలో జమ చేయడం జరిగింది.