రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ రాకపోవడంపై సీఎం రేవంత్ ఆగ్రహం

జూన్2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి ముంగిపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. ఈ వేడుకలకు రావాల్సిందిగా మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే ఈ వేడుకలకు తాను హాజరు కావడం లేదని కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్‌ పోకడలను నిరసిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అవతరన సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని, అమరుల త్యాగాల పర్యవసానమనీ కాకుండా.. కాంగ్రెస్‌ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న ఆ పార్టీ భావ దారిద్య్రాన్ని నిరసిస్తున్నానని చెప్పారు. ఇకనైనా వైఖరిని మార్చుకుని సంక్షేమానికి పాటుపడాలని సూచించారు. అమరుల చావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం వారి పేరు చెబుతూ రాజకీయాలు చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను ప్రజలు మరువరని అన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని సూచిస్తూ లేఖ రాసారు. దీనిపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

కేసీఆర్‌కు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ఆహ్వానం పలికితే.. తాను రానంటూ లేఖ రాయడం దారుణమన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఆయనకు గౌరవం లేదని.. కేసీఆర్ పాకిస్తాన్ వాళ్లల్లా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించడం లేదని, ఆమె రాకపోతే సందేశం పంపొచ్చన్నారు. ఈ ఏడాది జూన్​ 2 వ తేదీకి అత్యంత ప్రాధాన్యముందని రేపటితో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు. గడచిన పదేళ్లుగా రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు ఇంతకాలం కోల్పోయిన ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తామని సీఎం అన్నారు.