నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు వేయలేదు : విజ‌య‌శాంతి

రైతుబంధు వారోత్సవాల పేరిట టీఆర్ఎస్ హ‌డావుడి

హైదరాబాద్: సీఎం కెసిఆర్ పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి మండిప‌డ్డారు. రైతుల‌ను ఆదుకోవాల‌ని ఆమె కోరారు. ”ఆరుగాలం పండించిన ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లకు తరలించి, కాంటాలు వేయించడానికి రోజుల తరబడి వేచి చూసిన రైతన్నల ధాన్యాన్ని కొనేందుకు ముప్పుతిప్పలు పెట్టిన కేసీఆర్ సర్కార్… ఇప్పుడు కొన్న వడ్లకు పైసలు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేయడం సిగ్గుచేటు. వడ్లు కాంటా పెట్టిన 48 గంటల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని గప్పాలు కొట్టిన కేసీఆర్ ప్రభుత్వం… నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు వేయడం లేదని రాష్ట్రవ్యాప్తంగా రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులకు వరి ధాన్యం డబ్బులు పూర్తిగా ఆగిపోగా… మంచిర్యాల జిల్లావ్యాప్తంగా సుమారు రూ.270 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు రూ.150 కోట్లు మాత్రమే చెల్లింపులు చేసి రూ.వంద కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉందని తాజాగా రైతులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి రావడం రైతులపట్ల కేసీఆర్ సర్కార్‌కు ఉన్న చిత్త శుద్ధి ఏంటో ఇట్టే అర్థ‌మవుతుంది. వడ్లు తూకం వేసిన రెండు రోజుల్లోనే రైతు ఖాతాలలో ధాన్యం డబ్బులు జమ చేస్తామని మాటలు చెప్పిన సీఎం కేసీఆర్, ఆచరణలో మాత్రం ప్రకటనలు, ప్రచారాలకే పరిమితమై… రైతుబంధు వారోత్సవాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా వారి పార్టీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులతో హడావుడి చేసిన్రు.

యాసంగి సాగుకు వానాకాలం వడ్ల డబ్బులు అక్కరకు వస్తాయని నమ్మిన రైతన్నకు నిరాశే మిగలడంతో… తెలిసిన వారి వద్ద అప్పు కోసం తాళిబొట్లు కూడా కుదువపెట్టి మరీ సాగుచేస్తుండగా కొందరు రైతులు ఇవే వడ్ల డబ్బులపై ఆశలు పెట్టుకొని బిడ్డల పెళ్లిళ్లు, పిల్లల చదువుల కోసం ఎదురు చూసి చూసి కళ్లు కాయలు కాచేలా ఉన్నాయని అధిక మిత్తికి డబ్బుల కోసం ఫైనాన్స్‌ల చుట్టూ తిరగాల్సి తిరుగుతున్రు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఇవే పరిస్థితులను ఎదుర్కునే దుస్థితి రావడం కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనం. వడ్ల కొనుగోలుకు కేటాయించిన డబ్బులను రైతుబంధుకు మళ్లించి డ్రామాలాడుతున్న ఈ దగాకోరు సర్కార్‌కు రానున్న ఎన్నికల్లో రాష్ట్ర రైతాంగం ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయం” అని విజ‌య‌శాంతి అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/