గన్‌పార్క్‌ వద్ద క్యాండిల్‌ ర్యాలీని ప్రారంభించిన కేసీఆర్

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ క్యాండిల్‌ ర్యాలీని ప్రారంభించారు. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్‌ ర్యాలీ కొనసాగనుంది.

అంతకు ముందు గన్‌పార్క్ దగ్గర తన కోసం వేచి చూస్తున్న పార్టీ నేతల వద్దకు బంజారాహిల్స్ నందీనగర్ నుంచి బయల్దేరి వెళ్లగా లక్డీకపూల్‌ ట్రాఫిక్‌లో కేసీఆర్ చిక్కుకున్నారు. దాదాపు అరగంటకుపైగా ఆయన ట్రాఫిక్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణభవన్‌లో జరిగే కార్యక్రమానికి కేసీఆర్‌ అధ్యక్షత వహించనున్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతోపాటు గత పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు తదితర అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని పలు దవాఖానలు, అనాథ శరణాలయాల్లోని వారికి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులకు సూచించారు.