నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్..రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం

లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు ఇంకా వారం రోజుల గడువు కూడా లేకపోవడంతో అన్ని పార్టీల అభ్యర్థులు , నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ లో మరోసారి విజయడంఖా మోగించాలని రేవంత్ రెడ్డి..ఆ ఛాన్స్ ఇవ్వకూడదని బిఆర్ఎస్ , బిజెపి ఇరువురు అధికార పార్టీకి దీటుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ బస్సు యాత్ర తో ప్రజలను ఆకట్టుకుంటూ..కాంగ్రెస్ , బిజెపి ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఎంపీ అభ్య‌ర్థికి మ‌ద్ధ‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఆయన పర్యటనలు చేస్తున్నారు.

ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. నేటి సాయంత్రం ఇబ్ర‌హీంప‌ట్నంలో సీఎం రోడ్‌షో, కార్న‌ర్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంత‌రం ఉప్పల్‌, సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్‌ల‌లో పాల్గొని ప్రసంగిస్తారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మాదిరి.. మిగిలిన హామీలు కూ డా నెరవేర్చుతామని చెబుతున్నారు.

ఇక బిజెపి అగ్ర నేతలు సైతం రాష్ట్రంలో పర్యటిస్తూ బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు భువనగిరి పార్లమెంట్​ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే రాష్ట్రంలో రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్‌ధామి, తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తొలుత పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కు మద్దతుగా నిర్వహించే సభకు జేపీ నడ్డా హాజరై అనంతరం మధ్యాహ్నం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటుప్పల్‌లో జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారు. ఆ తర్వాత నల్గొండ నిర్వహించే సభలో నడ్డా పాల్గొననున్నారని పార్టీనేతలు వెల్లడించారు.