మున్సిపల్ సభ్యుడి చెంప చెళ్లుమనిపించిన డీకే శివకుమార్‌

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వివాదంలో చిక్కుకున్నారు. తన భుజం మీద చేయి వేసినందుకు ఓ కాంగ్రెస్‌ నేత చెంప చెళ్లుమనిపించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనిపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ…ఇది కాంగ్రెస్ పార్టీ నైజం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శనివారం ధార్వాడ్‌ లోక్‌ సభ ఎన్నికల అభ్యర్థి వినోదా అసూటీ తరుఫున హవేరీలో ఎన్నికల పరచారం నిర్వహించేందుకు డీకే వచ్చారు.

ఈ క్రమంలో ఆయన కారు దిగి వస్తుండగా.. ఆయన భుజం ఫై కాంగ్రెస్ మున్సిపల్ సభ్యుడు అల్లావుద్దీన్ మనియార్ చెయ్యి వేశారు. దీంతో, ఆగ్రహానికి లోనైన డీకే..ఆయన చెంప మీద లాగిపెట్టి కొట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అల్లావుద్దీన్‌ను వెనక్కు తోసేశారు. ఈ ఘటన తాలూకు వీడియోపై అమిత్ మాలవీయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ మున్సిపల్ మెంబర్‌ చెంప చెళ్లుమనిపించారు. హవేరీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలపై డీకే చేయి చేసుకోవడం ఇది కొత్త కాదు. మనియార్ తప్పేంటి అంటే ఆయన డీకే భుజంపై చేయి వేయడమే. అసలు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కోసం ఎందుకు పనిచేస్తారో నాకు అర్థంకాదు. వాళ్ల నాయకులు కార్యకర్తలపై చేయిచేసుకుంటుంటారు. నలుగురిలో అవమానిస్తుంటారు. ఎన్నికల్లో పోటీకి టిక్కెట్లు ఇవ్వరు. అవినీతి డబ్బు కోసమే కార్యకర్తలు కాంగ్రెస్ కోసం పనిచేస్తుంటారా? ఆత్మాభిమానం లేదా?’’ అని ఆయన ప్రశ్నించారు.