నేడు బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై చర్చించేందుకు బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ ఈరోజు సమావేశం కానుంది. బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌రావుసహా ఎంపీలందరూ పాల్గొనే ఈ సమావేశంలో కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్రం తెచ్చే బిల్లులు తదితర అంశాలపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహంపై అధినేత కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ సమావేశాల్లో పార్లమెంట్ 75 ఏళ్ల ప్రయాణంపై చర్చించనున్నట్లు అలాగే ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపినా.. జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు వంటి కీలక అంశాలపై అకస్మాత్తుగా చర్చించే అవకాశం ఉన్నందున.. ఈ అంశాలపై బీఆర్ఎస్ వైఖరి ఏంటనే దానిపై పార్లమెంట్ సభ్యులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నందున.. దానిపై బీఆర్ఎస్ వైఖరి గురించి కూడా నేతలకు కేసీఆర్ మార్గనిర్దేశనం చేయనున్నట్లు తెలిసింది.