కేటీఆర్ మామ హరినాథరావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్

కేసీఆర్‌ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్‌ మామ పాకాల హరినాథరావు అనారోగ్యంతో గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హరినాథరావు భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళ్లు అర్పించారు. హరినాథరావుకు మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు.

హరినాథరావు మృతి గురించి సమాచారం అందుకున్న మంత్రి కేటీఆర్ – శైలిమ దంపతులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం హరినాథరావు పార్థివదేహాన్ని రాయదుర్గంలోని ఆయన నివాసానికి తరలించారు. సీఎం కేసీఆర్ రాయదుర్గంలోని హరినాథరావు నివాసానికి వెళ్లి నివాళ్లు అర్పించారు. తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంతో ఉన్న తన కోడలు శైలిమను ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ దంపతులు ధైర్యం చెప్పారు. హరినాథరావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థించారు.

ఇక కేసీఆర్ తో పాటు మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు కూడా హరినాథరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు.