ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే సీఎం మోహన్ యాదవ్ కీలక నిర్ణయం

మధ్య ప్రదేశ్ సీఎం గా మోహన్ యాదవ్ బుధువారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే కీలక నిర్ణయం తీసుకొని షాక్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్ల విక్రయాలపై నిషేధం విధించారు. ఆహార భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించనున్నామని, బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు విక్రయించేవారిపై చర్యలు కూడా తీసుకోవాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

జనాల్లో సరైన అవగాహన కల్పించిన తర్వాత ఈ మేరకు చర్యలు ఉంటాయని కేబినెట్ భేటీ అనంతరం సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. డిసెంబర్ 15 నుంచి 31 మధ్య బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు విక్రయంపై నిషేధం అమలవుతుందని చెప్పారు. మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. అయోధ్య రాముడి గుడికి వెళ్లేవారికి మార్గమధ్యలో మధ్యప్రదేశ్ స్వాగతం పలుకుతుందని చెప్పారు. తునికాకు సేకరించేవారికి బస్తాకు రూ.4,000 చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.