మరోసారి కరోనా బారినపడిన ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రెండోసారి కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. అన్ని నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాను ’’ అని ఆమె ట్వీట్ చేశారు. జూన్ నెలలోనే ప్రియాంక కరోనా బారిన పడ్డారు. రెండు నెలల వ్యవధిలోనే రెండోసారి కరోనా బారినపడడం గమనార్హం. మరోవైపు రాహుల్ గాంధీ కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈరోజు రాజస్థాన్ పర్యటనను ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు. ఇటీవలే సోనియా గాంధీకి కూడా కరోనా సోకింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఆమె కోలుకున్నారు. ఇక ఇప్పుడు ప్రియాంక కరోనా బారినపడ్డారు.

వీరు మాత్రమే కాదు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు సైతం కరోనా బారినపడ్డారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ డిపార్టుమెంట్ హెడ్ పవన్ ఖేరా, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనూ సింగ్వీలకు కూడా కరోనా సోకింది. రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కూడా మంగళవారం కొవిడ్ సోకింది. తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఖర్గే ట్వీట్ లో కోరారు. ఇలా ఒకేసారి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు కరోనా బారినపడడం కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది.