నేడు యాదాద్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్

రామలింగేశ్వరస్వామివారి సన్నిధిలో పూజలు

హైదరాబాద్ : నేడు సీఎం కేసీఆర్‌ యాదాద్రికి వెళ్లనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొంటారు. ఎర్రవల్లి నుంచి రోడ్డుమార్గంలో ఆలయానికి చేరుకుంటారు. ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకుంటారు. అనంతరం రామలింగేశ్వరస్వామివారి సన్నిధిలో జరిగే మహాకుంభాబిషేక మహోత్సవంలో పాల్గొని నూతనాలయాన్ని పునఃప్రారంభిస్తారు.

ఉదయం 10.25 గంటలను ధనిష్ఠానక్షత్ర సుముహూర్తాన తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి చేతుల మీదుగా సపరివార రామలింగేశ్వర స్పటికలింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, ప్రతిష్ఠాంగహోమం, అఘోర మంత్రహోమం, దీగ్దేవతాక్షేత్రపాల బలిహరణం, శోభాయాత్ర, కలశప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శివాలయ మహాకుంభాభిషేకంలో భాగంగా మధ్యాహ్నం 12.30 గంటలకు మహాపూర్ణాహుతి, అవబృధం, మహాకుంభాభిషేకం నిర్వహించి స్వామివారి అనుగ్రహ భాషణం చేపట్టనున్నారు. అనంతరం మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, ప్రతిష్ఠాయాగ పరిసమాప్తి పలుకనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/