నేడు లక్ష మందితో చండూరులో కేసీఆర్ సభ

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నేడు ఆదివారం చండూరులో టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సభకు మునుగోడు నియోజకవర్గంలోని అన్నిగ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. చండూరు నుంచి అంగడిపేట దాటాక ఎకరం విశాలమైన స్థలంలో సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు వచ్చే వారి వాహనాల పార్కింగ్‌, వీఐపీల పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు.

కేసీఆర్‌ బంగారిగడ్డ సభపై మునుగోడు నియోజవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. మునుగోడు అభివృద్ధిపై కేసీఆర్‌ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారన్న దానితోపాటు సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఎలా స్పందిస్తారన్న దానిపైనా ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. శనివారం సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లుతో కలిసి సభా వేదిక వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.