నేడు మంచిర్యాలలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు మంచిర్యాలలో పర్యటించి పలు పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటనలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ), బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అలాగే చెన్నూరు ఎత్తిపోతల పథకం, ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు.

వివిధ వెనుకబడిన వర్గాలకు చెందిన చేతివృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించడంతో పాటు బహిరంగ సభలో ప్రసంగిస్తారని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రి మొదట బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం, కొత్త కలెక్టరేట్‌ భవనం ప్రారంభిస్తారు. బహిరంగ సభ వేదికపై వివిధ పథకాల లబ్దిదారు లకు లాంఛనంగా చెక్కులు అందజేస్తారు. వీటితోపాటు రూ.1,658 కోట్ల వ్యయంతో, లక్ష ఎకరాలకు సాగునీరందించే చెన్నూరు ఎత్తిపోతల పథకం, మందమర్రిలో రూ.500 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆయిల్‌పాం ఫ్యాక్టరీ, రూ.164 కోట్లతో గోదావరిపై నిర్మించనున్న మంచిర్యాల, అంతర్గాం రోడ్డు బ్రిడ్జి, రూ.205 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వైద్యకళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు.